DC vs SRH: మరోసారి నిరాశపరిచిన సన్‌రైజర్స్... వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్.! 4 d ago

IPL 2025లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC).. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య మ్యాచ్ జరిగింది. ఈసారి ఎలాగైనా 300 కొట్టాలి అని బరిలోకి దిగిన SRH జట్టు కనీసం 200 పరుగుల దగ్గరలోకి కూడా వెళ్లలేకపోయింది. మిచెల్ స్టార్క్ దెబ్బకు సన్‌రైజర్స్ బ్యాటర్లు నిలబడలేకపోయారు.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో లాగానే.. ఢిల్లీ జట్టుపై కూడా టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఢిల్లీ చేసిన ఫీల్డింగ్‌కు దిమ్మతిరిగిపోయింది...'క్యాచెస్ విన్ మ్యాచెస్' అనే నినాదాన్ని ప్రూవ్ చేశారు. వచ్చిన ప్రతి క్యాచ్ ని తీసుకుని..మ్యాచ్‌ను పట్టుబట్టి బిగించారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ చేతిలో చిత్తయ్యింది. దీంతో సన్‌రైజర్స్ జట్టు మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ ఓటమితో SRH టేబుల్ ఆరో స్థానానికి పడిపోయింది.. DC వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ టాప్-2 లోకి దూసుకెళ్లింది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈసారి 300 పక్కా లోడింగ్ అని మంచి జోష్ తో బరిలోకి దిగిన ఓపెనర్లు ఆకట్టుకోలేక పోయారు. గత సీజన్‌లో సంచలనంగా మారిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ..ఈసారి మాత్రం నిరాశే కనపరిచింది. అనవసర రన్‌కు ప్రయత్నించిన అభిషేక్ శర్మ (1) మొదటి ఓవర్‌లోనే రనౌట్ అయ్యి పెవిలియన్ కు వెనుతిరిగాడు. సిక్స్ కొట్టడానికి ప్రయత్నించిన ఇషాన్ కిషన్ (2) కూడా పెవిలియన్ కు చేరాడు.
స్లో బాల్ ని గాలిలోకి లేపి నితీష్ కుమార్ రెడ్డి ఢకౌట్ అయ్యాడు. ఐదో ఓవర్‌లో కూడా స్టార్క్ వేసిన బంతిని ట్రావిస్ హెడ్ బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా తరలిద్దామని ప్రయత్నించగా.. అది గ్లౌజ్ తగిలి నేరుగా కీపర్ చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో హెడ్ (22) కూడా తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో మొదటి 4.1 ఓవర్లకే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 37 పరుగులకు కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దెబ్బతో సన్‌రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఒకదశలో ప్రధాన బ్యాటర్లు వరుసగా అవుట్ అవ్వడంతో సన్‌రైజర్స్ వంద పరుగులు కూడా చేయలేదేమో అనిపించింది. కానీ.. 23 ఏళ్ల అనికేత్ వర్మ (74) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. టీం కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. క్లాసేన్ తో 42 బంతులకే 77 పరుగుల భాగస్వామ్యంతో టీం ను ఆదుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 32 రన్స్) నిలబడటంతో సన్‌రైజర్స్.. ఓ దశలో మంచి స్కోర్ వచ్చే సూచనలు కనిపించాయి. కానీ క్లాసెన్, అనికేత్ ఔట్ కావడంతో.. 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
అలవోకగా పరుగులు చేసే సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కట్టడి చేశారు. మిచెల్ స్టార్క్ 5 వికెట్లు.. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి విజృంభించారు.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన DC ఓపెనర్లు.. ఫ్రేజర్-మగార్క్, ఫాఫ్ డు ప్లెసిస్ మెరుపులు పుట్టించారు. మొదటి ఓవర్ నుండే SRH బౌలర్లను బాదారు. ఫాఫ్ డు ప్లెసిస్ 50 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, జాక్ ఫేజర్ మాగార్క్ 38 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కేఎల్ రాహుల్ 5 బంతుల్లో 15 పరుగులు చేసి వెనుతిరిగాడు. అభిషేక్ పోరెల్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (21) సునాయాసంగా పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. DC బ్యాటర్ల సూపర్ హిట్టింగ్ కు 16 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. DC హిట్టింగ్ ముందు SRH బౌలర్లు నిలబడలేకపోయారు. సన్‌రైజర్స్ జట్టు తరుపున జీషన్ అన్సారీ ఒక్కడే 3 వికెట్లు తీశాడు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న SRH ఈసారి కూడా విఫలం అయ్యింది. అసలు DC ఆటగాళ్లు ఒక్కసారి కూడా గెలిచే అవకాశం ఇవ్వలేదు. వరుస విజయాలతో కెప్టెన్ అక్షర్ పటేల్.. డీసీను పాయింట్స్ పట్టికలో ముందుకు తీసుకెళ్లాడు. DC అటు బౌలింగ్.. బ్యాటింగ్... ఫీల్డింగ్ లోను అద్భుత ప్రదర్శన కనపరిచింది. కీలకమైన 5 వికెట్లను తీసుకుని మిచెల్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI) మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో MI తమ మొదటి విజయం కోసం పోరాడుతుంది, అదే సమయంలో KKR తమ గెలుపు ర్యాంబోను కొనసాగించాలనుకుంటుంది.